జాతీయం

రాహుల్‌ అలా చేయడం దురదృష్టకరం: ఏచూరి

దిల్లీ: ఈ లోక్‌సభ ఎన్నికల్లో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడితే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా దేశ రాజకీయాల గురించి ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్‌ ఏర్పడుతుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

‘69% లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నట్లయితే తిరిగి అధికారంలోకి రావచ్చని భారతీయ జనతా పార్టీ గొప్పలు పోతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తే మొదటి మూడు, నాలుగు దశల ఎన్నికల్లో ఆ పార్టీ 130 మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవకాశమిచ్చింది. కానీ వారిలో గెలిచే అవకాశం ఉన్న వాళ్లు సగం మంది మాత్రమే. 2014లో వచ్చిన సీట్లలో కనీసం సగం సీట్లు సంపాదించుకోవడం కూడా ఆ పార్టీకి కష్టంగా మారుతుంది. అయితే ఫలితాల తర్వాత భాజపా మరిన్ని తమ ఎన్డీయే కూటమిలో మరిన్ని పార్టీలను చేర్చుకుంటే తప్ప మళ్లీ అధికారం అసాధ్యం. ఇక ఎన్నికల తర్వాత హంగ్‌ ఏర్పడుతుందని చాలా మంది ఊహిస్తున్నారు. దేశ రాజకీయాలకు ఇది కొత్తేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అనుసరించే అస్త్రం పొత్తు. ఇలా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.  1996లో యునైటెడ్ ఫ్రంట్‌, 1998లో ఎన్డీయే, 2004లో యూపీఏ ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే. ఈ సారి కూడా అదే పునరావృతం కాబోతుంది. ఇక మా విషయానికొస్తే మేమెప్పుడూ లౌకిక వాద ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం. ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వంగా దాన్ని తయారు చేస్తాం. పార్లమెంటులో వామపక్షాలు గళానికి ఎంతో బలముంది.  వామపక్షాల కారణంగానే యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, అటవీ చట్టం, ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో పోటీ విషయానికొస్తే కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీ చేయడం గురించి మాట్లాడాల్సిందిగా అందరూ అడుగుతున్నారు. ఆయన వామపక్షాల మీద పోటీకి దిగడం దురదృష్టకరం. సోనియా గాంధీకి కర్ణాటక నుంచి పోటీ చేయమని నేనే సలహా ఇచ్చాను. కానీ ఇప్పుడు రాహుల్‌ భాజపా మీద పోటీకి కాకుండా వామపక్షాలపై పోటీకి దిగడం సమంజసం కాదు’ అని తెలిపారు.