Uncategorized

రాధా రవిపై సస్పెన్షన్‌ వేటు

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, డీఎంకే నేత రాధారవిపై ఆ పార్టీ వేటు వేసింది. అగ్ర కథానాయిక నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తమిళ చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఇప్పటికే ఆయనను తమ సినిమాల్లోకి తీసుకోబోయేది లేదంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్‌ స్టూడియోస్‌ ప్రకటించింది. ఇప్పుడు తమిళనాడు ప్రతిపక్షపార్టీ డీఎంకే కూడా ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

‘రాధారవి చేసిన వ్యాఖ్యలు సమర్థించదగినవి కావు. డీఎంకే పార్టీ ఆది నుంచి మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ వస్తోంది. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెనకేసుకు రాలేం. మహిళల హక్కులను కాలరాయలేం. పార్టీ అధిష్ఠానం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.’ అని ట్వీట్‌ చేశారు.

ఓ సినిమా ప్రచారానికి అతిథిగా విచ్చేసిన రాధారవి వేదికపైకి వచ్చి ప్రసంగిస్తూ నయన్‌పై అనుచిత కామెంట్లు చేశారు. ‘నయనతార ఇప్పుడు ఒక స్టార్‌ నటి. ఆమెను అంతా లేడీ సూపర్‌స్టార్‌ అంటారు. ఒకప్పుడు సినిమాలో దేవత పాత్రలు చేయాలంటే అందుకు కేఆర్‌ విజయనే సంప్రదించేవారు. కానీ ఇప్పుడు ఎవరుపడితే వారు (నయన్‌తారను ఉద్దేశిస్తూ) దేవతామూర్తుల పాత్రలను పోషిస్తున్నారు. నయన్‌ హారర్‌ చిత్రాల్లోనూ నటిస్తారు. చెప్పాలంటే నయన్‌ను చూసి దెయ్యాలు కూడా పారిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో పాటు చిన్మయి శ్రీపాద, రాధికా శరత్‌కుమార్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు ట్విటర్‌ వేదికగా రాధా రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.