ఆంధ్రప్రదేశ్

రాజకీయాలు నేర్చుకునేలా చేయొద్దు:లారెన్స్‌

చెన్నై: ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ పార్టీ చీఫ్‌ కన్వీనర్‌ సీమాన్‌ను దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ హెచ్చరించారు. సీమాన్‌ ఇటీవల తన ప్రసంగంలో పలుమార్లు లారెన్స్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ కార్యకర్తలు పలు ప్రచార కార్యక్రమాల్లో, సోషల్‌మీడియాలో లారెన్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీమాన్‌కు లారెన్స్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన సేవా కార్యక్రమాల గురించి చెత్తగా మాట్లాడటం సరికాదని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు.
‘మీ పార్టీ కార్యకర్తలు సోషల్‌మీడియాలో అనవసరంగా నా దాతృత్వ కార్యకలాపాలపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీని వల్ల నేను మానసికంగా చాలా బాధపడ్డా. నేను ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడికి మీ పార్టీకి చెందిన వారొచ్చి బూతులు మాట్లాడి వెళ్లారు. నువ్వు నా గురించి చెడ్డగా ఓ కార్యక్రమంలో చెప్పిన తర్వాత ఇలాంటివి మొదలయ్యాయి. నేను సంరక్షిస్తున్న దివ్యాంగుల్ని మీ కార్యకర్తలు వేధిస్తున్నారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి సూటిపోటి మాటలు అంటున్నారు’.
‘నాపై చేసిన విమర్శలకు నేను తిరిగి సరైన సమాధానం ఇవ్వగలను. కానీ నా పిల్లలు, నా అభిమానులకు జరిగే సంఘటనల్ని నేను తిప్పికొట్టలేను. నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అందులో నేను జీరోని. గతంలో డ్యాన్సింగ్‌ విషయంలో నేను జీరో.. కానీ ఆ కళ నేర్చుకున్నా. దర్శకత్వంలో నేను జీరో.. తర్వాత దాన్నీ నేర్చుకున్నా. నిర్మాణంలో కూడా నేను జీరోనే.. ఆ రంగంలోకి వచ్చా. కాబట్టి నేను రాజకీయాలు నేర్చుకునేలా నువ్వు చేయొద్దు. నేనూ దానీ నేర్చుకోగలను.. అందులో హీరో కాగలను. నువ్వు ఎక్కువగా మాట్లాడుతుంటావు.. నేను ఎక్కువగా సేవ చేస్తుంటాను. మనం ఇద్దరం ఓ చోట కూర్చొని చేసిన మంచి పనుల్ని లెక్కేస్తే.. నా దగ్గరే ఎన్నో ఉంటాయి. నువ్వేమైనా నలుగురికి మంచి చేశావా? ఇది ఎన్నికల సమయం. అందుకే మంచి కోసం నీ పేరును ప్రస్తావించలేదు. నేను సరిగా చెప్పాను అని నీకు అనిపిస్తే.. నాకు ఫోన్‌ చెయ్‌. మనం చర్చించుకుని.. పరిష్కరించుకుందాం. మన పనుల్ని ప్రశాంతంగా చేసుకుందాం. జీవిద్దాం.. జీవితాన్నిద్దాం. దీన్ని ఓ సమస్యలా తీసుకుని నువ్వు, నీ కార్యకర్తలు ప్రవర్తిస్తే.. ఎదుర్కోవడానికి నేను సిద్ధం. శాంతి కావాలా?, సమస్య కావాలా?నువ్వే నిర్ణయించుకో..’ అని లారెన్స్‌ తమిళంలో పోస్ట్‌ చేశారు.

లారెన్స్‌ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి సీమాన్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ప్రచారం కోసమే లారెన్స్‌ ఇలాంటివి చేస్తుంటారని ఆయన ఆరోపించారు.