అంతర్జాతీయం

రసెల్‌ మాకు అతి పెద్ద ఆస్తి

ప్రపంచ కప్‌లో భాగంగా నాటింగ్‌ హామ్ వేదికగా వెస్టిండీస్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మెగాటోర్నీ ఆరంభంలోనే పాక్‌కు పరాభవం ఎదురైంది. విండీస్‌ అన్ని విభాగాల్లో రాణించడంతో పాక్‌ను 105 పరుగులకే కట్టడి చేసింది. మ్యాచ్‌ క్రెడిట్‌ను ఆ జట్టు సారథి జేసన్‌ హోల్డర్‌ బౌలర్లకే అంకితం చేశాడు. ఈ మేరకు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘ప్రపంచ కప్‌ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్‌ క్రెడిట్‌ బౌలర్లకే అంకితం. క్రిస్‌గేల్‌ ఎప్పటిలాగానే అద్భుతంగా ఆడాడు. ఇక మా జట్టుకు దొరికిన అరుదైన రకం ఆటగాడు రసెల్‌. అతడి ప్రభావం జట్టులో చాలా ఉంటుంది. అతడే మా ఆస్తి. బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అతడు 100 శాతం న్యాయం చేశాడు. ఒషానే, షెల్డోన్‌ కూడా చాలా బాగా బౌలింగ్‌ చేశారు. ఒషానే బౌలింగ్‌లో మ్యాచ్‌ గెలవాలన్న కసి కనిపించింది. మొదటి మ్యాచ్‌ ఎలా సాగుతుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ అత్యంత సులువుగా గెలిచేశాం. మాకెలాంటి అంచనాలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపాడు.

విండీస్ బౌలర్ల ధాటికి పాక్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఒషేన్‌ థామస్‌, రసెల్‌, హోల్డర్‌ల పదునైన పేస్‌కు 21.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకే ఇన్నింగ్స్‌ ముగించారు. ఈ మ్యాచ్‌ కనీసం టీ20 మ్యాచ్‌ అంతసేపైనా సాగలేదు. 218 బంతులు మిగిలి ఉండగానే కరీబియన్‌ జట్టు పాక్‌ కథను ముగించడం విశేషం.