అంతర్జాతీయం

రసెల్‌ను తప్పుబట్టిన హేల్స్‌

చెన్నై : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ ఆటతీరును ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌ తప్పుబట్టాడు. హేల్స్‌ గతంలో ముంబయి ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కోల్‌కతా 79 పరుగులకు 9వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన గర్నీతో కలిసి ఆండ్రీ రసెల్‌ కోల్‌కతా స్కోరును 108కి చేర్చాడు. అయితే, చాలాసార్లు సింగిల్‌ తీసే అవకాశం వచ్చింది. స్ట్రైకింగ్‌ ఇస్తే గర్నీ అవుటవుతాడన్న ఆలోచనతో రసెల్‌ పరుగు తీసేందుకు నిరాకరించాడు. దీంతో రసెల్‌ ఆటతీరుపై అలెక్స్‌ హేల్స్‌ ట్విటర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గర్నీ ఆన్‌డ్రైవ్‌ షాట్లను రసెల్‌ చూస్తే ఇలా చేసి ఉండేవాడు కాదేమో.? అన్నాడు. తక్కువ స్కోరింగ్‌ మ్యాచుల్లో ప్రతి పరుగూ కీలకమే కాబట్టి టెయిలెండర్ల బ్యాటింగ్‌ సామర్థ్యం గమనించాలన్నాడు. ఈ మ్యాచ్‌లో రసెల్‌ 50 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా కోల్‌కతాను గెలిపించలేకపోయాడు. చివరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.