సినిమా

రండి.. లంక బాధితులను ఆదుకుందాం

ముంబయి: వరుస బాంబు పేలుళ్లతో అతలాకుతలమైన శ్రీలంకను ఆదుకుందామని పిలుపునిచ్చారు బాలీవుడ్‌ నటి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్. ఆమె కూడా శ్రీలంకకు చెందినవారే. పేలుడు ఘటనల్లో దాదాపు 250 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో లంక బాధితులను ఆదుకుందామంటూ జాక్వెలీన్ సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.
‘ఎవరో చేసిన పనికి అంతమంది అమాయక ప్రజలు, పిల్లలు ఎందుకు బలవ్వాలో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. ఉగ్రదాడులను ప్రజలు ముందే పసిగట్టలేరు కదా. కానీ మనమంతా ఒక్కటైతే గాయపడిన లంకను మామూలు స్థితికి తీసుకురాగలం. నేను ‘ట్రెయిల్‌’ అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఈ సంస్థ శ్రీలంక పేలుళ్లలో గాయపడిన బాధితులకు సాయం చేస్తోంది. జాతి, మతాలను పక్కన పెట్టి మీరు కూడా నాతో చేరండి. మానవత్వాన్ని కోల్పోకండి. భయాన్ని, కోపాన్ని దరిచేరనీయకండి’ అని పేర్కొన్నారు జాక్వెలీన్‌.