జాతీయం

యూపీలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న ఆరో విడత సార్వత్రిక పోలింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జౌన్‌పూర్‌లోని శాహ్‌గంజ్‌ పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఓ యువకుడు బిజెపి జెండాతో తన బూట్లు తుడుచుకున్నాడు. దీనిని చూసిన బిజెపి కార్యకర్త  అతడి దగ్గరకు వెళ్లి తీవ్ర పదజాలంతో  దూషించాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అంతలో అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని చితక్కొట్టారు.  అదే సమయంలో యువకుడి తరఫు వారు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. విషయం తెలుసుకున్ప పోలీసులు లాఠీ ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ సంఘటన వల్ల పోలింగ్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరం ఏర్పడలేదని అధికారులు తెలిపారు.