అంతర్జాతీయం

యుద్ధానికా.. అయితే మేము ఇంటికెళుతున్నాం!

వాషింగ్టన్‌: హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తతల విషయంలో అమెరికా నిర్ణయాలు మిత్రదేశాలకు కూడా నచ్చడంలేదు. తాజాగా స్పెయిన్‌ అమెరికా మిత్ర బలగాల నుంచి తన ఫ్రిగేట్‌ను వెనక్కు పిలిపించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌ రక్షణ మంత్రి మార్గెరేట్‌ రోబ్లెస్‌ ప్రకటించారు. దీంతో స్పెయిన్‌కు చెందిన ఎఫ్‌-104 ఫ్రిగెట్‌, 2015 మంది నావికులు తిరిగి వెళ్లిపోనున్నారు. వీరంతా మిషిన్‌ సర్య్కూమ్‌ నేవిగేషన్‌ మిషన్‌లో పనిచేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని బ్రసెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ రక్షణ మంత్రుల సమావేశంలో తీసుకొన్నారు. ఇప్పటి వరకు వీరు యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌తో కలిసి పనిచేశారు. కాకపోతే ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని స్పెయిన్‌ రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా-స్పెయిన్‌ సంబంధాలపై..
ఈ నిర్ణయం అమెరికా స్పెయిన్‌ సంబంధాలపై ప్రభావం చూపుతుందని అమెరికా పత్రికలు పేర్కొంటున్నాయి.  అమెరికా నమ్మకాన్ని స్పెయిన్‌ కోల్పోతుందని పేర్కొంటున్నాయి. దీనిపై స్పెయిన్‌ రక్షణ మంత్రి మాట్లాడుతూ ‘‘ మేము యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ సంస్థలకు కట్టుబడి ఉన్నాము. స్పెయిన్‌ నమ్మకమైన భాగస్వామి. నాటో, ఈయూ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.