ఆంధ్రప్రదేశ్

యాపిల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు

దిల్లీ: యాపిల్‌ ఫోన్‌ కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ మోడల్‌లోని అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ) ధర రూ. 76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఇది రూ. 59,900కే రానుంది. ఇక 128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 నుంచి రూ. 64,900కు తగ్గనుంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ) ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు దిగిరానుంది. అంతేగాక.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువగా ఉండటంతో పాటు.. శాంసంగ్‌, షామీలాంటి కంపెనీల నుంచి పోటీ అధికంగా ఉండటంతో ఐఫోన్‌ విక్రయాలు మందగించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను తీసుకొచ్చిందని యాపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు.