జాతీయం

మోదీ హద్దులు మీరారు: మాయావతి

లఖ్‌నవూ: ప్రధాని నరేంద్ర మోదీపై వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బీఎస్సీ అధినేత్రి మాయావతి తాజాగా ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ పత్రాల్లోనే ఓబీసీ అని.. అలాగే ఆయన అవినీతిరహితుడన్న విషయం కూడా కేవలం కాగితాలకే పరిమితమని విమర్శించారు. తన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మోదీకి ఉన్నప్పటికీ..మత విద్వేషాలతో సాగిన ఆయన పాలనా కాలం బిజెపి, దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయాయన్నారు. కానీ, తన హయాంలో యూపీలో ఎలాంటి అల్లర్లు, అరాచకాలు చోటుచేసుకోలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ భాజపా కంటే బీఎస్పీ ప్రభుత్వమే మెరుగ్గా పనిచేసిందన్నారు.

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత దేశంలో అల్లర్లు పెరిగిపోయాయని.. ఆయన ఆ పదవికి అనర్హుడని అభిప్రాయపడ్డారు. బీఎస్సీని ‘బెహన్‌జీకి సంపత్తీ పార్టీ’ అని మోదీ పేర్కొనడం పట్ల ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని తన హద్దుల్ని మీరి విమర్శలు చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఎస్పీ అధ్యక్షురాలిగా తనకున్నదంతా.. ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇచ్చినవేనని తెలిపారు. వీటికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారాన్ని దాచిపెట్టలేదన్నారు. ఇతర పార్టీలను అవినీతిపరులని విమర్శిస్తున్న భాజపాలోనే ఎక్కువమంది దోషులు ఉన్నారన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. యూపీలో ఇప్పటికే ఆరు విడతల్లో పోలింగ్‌ పూర్తయింది. చివరి విడతలో భాగంగా.. మే 19న మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.