జాతీయం

మోదీ ప్రమాణ స్వీకారం.. అతిథులు వీరే

రెండోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ వేడుకకు హాజరు కానున్ను అతిథుల జాబితా కూడా అంతే ఘనంగా ఉంది. ప్రపంచ స్థాయి నేతలు, అత్యున్నత సంస్థల అధినేతలు, వ్యాపారం, సినిమా, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని సమాచారం.

భారత ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేశ్ అంబానీ, గౌతమ్‌ అదానీ, రతన్‌ టాటా, అజయ్ పిరమాల్‌ ఈ వేడుకకు హాజరు కానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో భారత్‌కు పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టిన మాజీ స్ప్రింటర్‌ పీటీ ఉష, క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, హర్భజన్‌ సింగ్, బాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్, కోచ్‌ పుల్లెల గోపీ చంద్‌, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, తదితరులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. కంగనా రనౌత్, షారుక్‌ ఖాన్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, కరణ్ జోహార్, రజనీ కాంత్‌ వంటి సినీ ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు.
సిస్కో సిస్టమ్స్‌ మాజీ సీఈఓ జాన్‌ చాంబర్స్‌, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇంటర్ననేషనల్ మానిటర్‌ ఫండ్ డైరెక్టర్‌ క్రిస్టినా లగార్డే వంటి అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

వీరితో పాటు బిమ్స్‌టెక్‌ ప్రతినిథులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ దేశాల నేతలతో పాటు కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు, ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ సూరోన్‌బే జీన్‌బెకోవ్, మారిషస్‌ ప్రధాని ప్రవింద్ కుమార్ జగనాథ్ ఈ కార్యక్రమానికి రానున్నారు. అలాగే మనదేశ విపక్ష నాయకులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఆహ్వానాలు అందాయి. దేశ, విదేశీ ప్రముఖులతో కలిపి రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ వేడుకకు హాజరుకానున్న అతిథుల సంఖ్య 8,000పైగా ఉండనున్నట్లు సమాచారం. మే 23న వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా 542 పార్లమెంటరీ స్థానాలకు గానూ 303 స్థానాలు గెల్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసింది.