జాతీయం

మోదీ ప్రమాణస్వీకారానికి కమల్‌, రజనీ

దిల్లీ: భారత ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నరేంద్రమోదీ ప్రమాణస్వీకారానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌లను కూడా ఆహ్వానించారు. ఈ మేరకు పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అఖండ మెజార్టీ సాధించడంతో మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటే మంత్రివర్గం కూడా ప్రమాణం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి సార్క్‌ దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓ భారత ప్రధాని ప్రమాణస్వీకారానికి సార్క్‌ దేశాధినేతలు రావడం అదే తొలిసారి కావడం విశేషం. ఈసారి కూడా ప్రపంచ దేశాల అధినేతలను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఆహ్వానం కూడా పంపగా.. ఆయన అంగీకరించారు.