జాతీయం

మోదీ ప్రభుత్వం విఫలమైంది: మన్మోహన్‌ సింగ్

న్యూదిల్లీ: ఎన్డీఏ విధానాలపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘దేశ భద్రత విషయంలో రాజీపడడం సరికాదు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యతిరేక శక్తులపై నిఘా, జాతీయ భద్రత విషయంలో విఫలమయ్యారు. గత ఐదేళ్లుగా పాకిస్థాన్‌ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు జరుపుతున్నాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ వద్ద ఉగ్రదాడి జరిగినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేసింది. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ.. పఠాన్‌కోట్‌కు వచ్చి విచారణ జరపడానికి అనుమతిచ్చింది. ఈ ఐదేళ్లలో జమ్ముకశ్మీర్‌లో అంతర్గత భద్రత క్షీణించింది. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని వ్యాఖ్యానించారు.

‘యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకుంటూ వచ్చింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వృద్ధి బలహీనపడింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్‌’ పథకం ఓ గొప్ప ఆలోచన. ఈ పథకం.. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా, మళ్లీ మన ఆర్థిక స్థితి మెరుగుపడేలా చేస్తుంది. ఈ పథకం గురించి ఇప్పుడు దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని సరళీకరించాలనుకుంటోంది’ అని మన్మోహన్‌ సింగ్ తెలిపారు.