అంతర్జాతీయంజాతీయం

మోదీజీ.. మీ విజయం మీ శ్రమకు గుర్తింపు

సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అభినందనలు తెలియజేశారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ చేరుకున్న ఇరువురు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సమావేశమమైన వేళ ట్రంప్‌ ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, 5జీ సాంకేతికత, రక్షణ రంగంలో సహకారమే అజెండాగా ఈ సమావేశం జరిగింది. ‘‘మీ(ట్రంప్‌)తో భేటీ కావడం సంతోషంగా ఉంది. రెండోసారి భారత ప్రజలు నాకు సంపూర్ణ మద్దతు తెలపడంపై ఫోన్‌ ద్వారా మీరు శుభాకాంక్షలు తెలిపారు. దానికి కృతజ్ఞతలు. భారత్‌తో సంబంధాల పట్ల మీ ఆసక్తిని తెలియజేస్తూ మీరు రాసిన లేఖను రెండు రోజుల క్రితం అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో మాకు అందించారు. సానుకూల వాతావరణంలో పాంపియోతో భేటీ జరిగింది. ఈరోజు భేటీలో ఇరాన్, 5జీ, రక్షణ సహకారంతో పాటు మరికొన్ని ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించబోతున్నాం. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకు భారత్‌ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌-దిల్లీ మధ్య ఎప్పటికీ మెరుగైన సంబంధాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. వాణిజ్య, రక్షణ అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో మీరు(మోదీ) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మీ విజయం మీ శ్రమకి గుర్తింపు. మిలిటరీ, రక్షణతో పాటు ఇతర రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. వాణిజ్య, ఉత్పత్తి రంగాలపై తదుపరి జరిగే సమావేశాల్లో చర్చించుకుందాం’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయా దేశాధినేతలు ఒసాకా చేరకున్నారు.

జపాన్‌, అమెరికా, ఇండియా త్రైపాక్షిక చర్చలు
అంతకు ముందు జపాన్‌ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన త్రైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తమ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలనుకుంటున్న భారత్‌లాంటి దేశాలతో అమెరికా మెరుగైన సంబంధాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం, మౌలిక వసతుల అభివృద్ధిలో మెరుగైన సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్లు మోదీ తెలిపారు.

ఉగ్రవాదంతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు..
అనంతరం జరిగిన బ్రిక్స్‌ దేశాల అనధికారిక సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ప్రపంచ దేశాలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం వల్ల మానవ మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే ఉగ్రవాదంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉందని.. సామాజిక అస్థిరతకూ దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.