సినిమా

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన ఈమేనట!

హైదరాబాద్‌: మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాలో కథానాయిక ఖరారయ్యారు. ఈ సినిమాలో ఆయన సరసన నూతన నటి కృతి శెట్టి నటించబోతున్నారు. ఆమె ఫొటోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. మే 25 నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుందని పేర్కొంది. కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తొలి సినిమా ఇది. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌ను బట్టి ఈ సినిమాలో హీరో జాలరి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్‌ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇందులో తమిళ హీరో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.