ఆంధ్రప్రదేశ్

ముగిసిన ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం తొలి సమావేశం ముగిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌.. సుమారు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అక్టోబర్‌ నుంచి రూ.12,500 చెల్లింపుతో రైతు భరోసా అమలు, వైఎస్సార్‌ ఆసరా కింద వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కి పెంపు, ఆశా వర్కర్లకు రూ.10వేల వేతనాల పెంపునకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు భారీగా వేతనాలు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలోని 7,265 మంది హెల్త్‌వర్కర్లకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. సీపీఎస్‌ రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలపై కమిటీలు వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.