జాతీయం

మీ జాతకం మొత్తం మా దగ్గర ఉంది:ఇమ్రాన్‌ఖాన్‌

జూన్‌ 30లోగా ఆస్తుల వివరాలను వెల్లడించాలని ప్రజలకు విజ్ఞప్తి 

 

చావనైనా చస్తాను, కానీ రుణం మాత్రం తీసుకోను’ పాకిస్థాన్ ఎన్నికల ప్రచార సమయంలో ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాట ఇది. అయితే, తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు ఆదాయ వనరుల కోసం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాద దేశంగా ముద్ర పడటంతో పెట్టుబడులు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యల నుంచి గటెక్కేందుకు ఉన్నఅన్ని దారులను ఇమ్రాన్‌ పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రజలకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. జూన్‌ 30వ తేదీలోగా ప్రతి పౌరుడు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని కోరారు. అక్రమాస్తులు కలిగి ఉన్నవారు ‘పన్ను క్షమాపణ పథకం’ కింద వివరాలు వెల్లడించి, అక్రమ సొమ్మును ప్రభుత్వానికి అప్పగిస్తే, అలాంటి వారిపై చర్యలు తీసుకోమని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా పాక్‌ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ‘మనది గొప్ప దేశం కావాలంటే మనలో మార్పు రావాలి. ప్రజలందరూ ‘ఆస్తుల ప్రకటన పథకం’లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే మీరు పన్నులు చెల్లించకపోతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడపలేం. ’ అని విన్నవించారు. జూన్‌ 30వ తేదీలోగా అక్రమాస్తులు, బినామీ పేర్ల మీదున్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలు వివరాలను వెల్లడించి, వాటికి పన్ను చెల్లించాలని కోరారు.

‘ఆస్తుల వెల్లడికి మీకు జూన్‌ 30 వరకూ మాత్రమే అవకాశం ఇస్తున్నా. ఇప్పటికే ఎవరైతే బినామీల పేరుతో అక్రమాస్తులు సంపాదించారో వారి వివరాలను ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించాయి. వారి మొత్తం జాతకం మా దగ్గర ఉంది. మీరు మీ అక్రమ సంపాదనను దాచాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ అవకాశం మళ్ళీ రాదు. పాకిస్థాన్‌కు మేలు చేయండి. మీ చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయండి. దేశాన్ని సొంత కాళ్లపై నిలబడేలా చేసి, పేదరికాన్ని రూపు మాపండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. గత పదేళ్ల కాలంలో పాకిస్థాన్‌ అప్పులు రూ.6వేల బిలియన్ల నుంచి రూ.30వేల బిలియన్లకు చేరిందని అన్నారు.