ఆంధ్రప్రదేశ్

మీకు ప్రజలే బుద్ధి చెబుతారు

(స్నెహ టీవి) అమరావతి: 2019 ఎన్నికలు సుస్థిర, అరాచక కూటముల మధ్య పోటీ అని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అనడం హాస్యాస్పదం అని ఏపీ మంత్రి యనమల రామక‌ృష్ణుడు అన్నారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల రామకృష్ణుడు.. సుస్థిరత పేరుతో ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ కాలరాసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ రాజ్యాంగ విలువలను భ్రష్టుపట్టించిందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

స్వతంత్రంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చిందని.. సీబీఐ, ఈసీ, ఐటీ అన్నింటినీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని యనమల అన్నారు. ఉదయం 12గంకు ఈసీ ప్రెస్ మీట్ అని చెప్పి ప్రధాని మోది అజ్ మీర్ సభ ఉందని 3గంకు మార్చడమే తాజా రుజువని గుర్తు చేశారు.

సుస్థిర ప్రభుత్వం అంటే వ్యవస్థలను ఎలాపడితే అలా వాడుకోమని కాదని, ఏదిపడితే అది చేయడం కాదని తెలిపిన యనమల.. సుస్థిర ప్రభుత్వం పేరుతో ప్రజల హక్కులను కాలరాయడం, వ్యవస్థలను పతనం చేయడం కాదని తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకు..? ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే సుస్థిర ప్రభుత్వాలు అవసరమా..? అంటూ యనమల ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? డిఫెన్స్ స్కామ్ ల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? అంటూ ఈ సందర్భంగా యనమల అనుమానాలు వ్యక్తం చేశారు. రాఫెల్, కోల్ స్కామ్, బ్యాంకుల దివాలా, ఆర్ధిక నేరస్తుల పరారీ, వేటిపైనా మోదీ ఎందుకు నోరు తెరవరు..? అంటూ ఆయన ప్రశ్నించారు. భాగస్వామ్య పక్షాలను మోసం చేసే బీజేపీ ఇతర పార్టీల కూటమిపై ఎలా మాట్లాడుతుందని అన్నారు.

గత 4ఏళ్లుగా కేంద్రంలో నానా రకాల విఫల ప్రయోగాలు చేస్తున్నారని, అరాచక పాలన చేస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరించి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో బడుగు బలహీన వర్గాలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయని.. పెట్రోధరలు, ఎరువులు, గ్యాస్, నిత్యావసర ధరలు చుక్కలనంటాయని.. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని.. ఏ రంగంలో చూసినా ఘోర వైఫల్యాలే కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు సుస్థిరత, అరాచక కూటమి అనే పదాలు వల్లె వేస్తున్నారని యనమల విమర్శించారు.

ప్రజలు దేనినైనా సహిస్తారు గాని మోసాన్ని, ద్రోహాన్ని సహించరని.. ఏది అరాచక కూటమి, ఏది సుస్థిర కూటమి అనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా డ్రామా అధికారికంగా ధ్రువీకరించబడిందని.. ఈసీ ప్రకటనే ఆ నాటకాన్ని బయటపెట్టిందని, బీజేపీ, వైసీపీ లాలూచికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఏం కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాటకాన్ని టీడీపీ ముందే ఎండగట్టిందని చెప్పుకొచ్చారు.? ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, లాలూచి పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని యనమల తెలిపారు.