జాతీయం

‘మా బుక్స్‌ టీచర్లు తాకేవారు కాదు’

పాఠశాలలో అందరితో పాటు మమ్మల్ని కూర్చోనిచ్చేవాళ్లు కాదు. టీచర్లు మా పాఠ్యపుస్తకాలను తాకేవారు కాదు. కనీసం దాహం వేస్తే మేము నీటి కుండను తాకకూడదు. పాఠశాల ప్యూన్‌ కుండను పైకెత్తి నీళ్లు పోసేవారు. ప్యూను రాకపోతే మాకు కనీసం నీళ్లు కూడా ఇచ్చేవాళ్లు కూడా లేరు. ఆ రోజంతా దాహంతో ఉండిపోయేవాళ్లం”.. రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బాల్యంలో పడిన దీనావస్థ ఇది. అదే పాఠశాలలో తన సోదరుడితో కలిసి విద్యనభ్యసించారు. తరగతి గదిలో కూర్చునేందుకు ఎలాంటి సౌకర్యాలను వారికి కల్పించలేదు. దీంతో వారే ఇంటినుంచి ఒక గోనెసంచిని తీసుకువచ్చి దానిపైనే కూర్చుని చదువుకున్నారు.

సవాళ్లను అధిగమించి.. 

ఇలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కొన్న ఆయన వాటిని సవాళ్లుగా స్వీకరించారు. విద్యావేత్తగా ఎదిగారు. అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేశారు. భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కుల నిర్మూలనపై అనేక వ్యాసాలు రాశారు, పోరాటాలు చేశారు. కుల నిర్మూలనతోనే రాజకీయ సమానత్వం వస్తుందని ఆయన పిలుపునిచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని మధించి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రచించారు. అంబేడ్కర్‌ గొప్ప సాహితీవేత్త ఆయనలాగా మరెవరూ అన్ని గ్రంథాలను చదివి ఉండకపోవచ్చు. మారుముల ప్రాంతంలో పుట్టి విజ్ఞాన శిఖరంగా ఎదిగిన మహనీయుని జయంతి ఈ రోజు (ఏప్రిల్‌ 14). ఆయనను మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.