తెలంగాణ

మాటలతో ఆకట్టుకోవడమే మోదీ పని: కేటీఆర్‌

నర్సంపేట: గత ఐదేళ్లలో ప్రధాని మోదీ చేసిందేమీ లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మాటలు చెప్పి ఆకట్టుకోవడమే ఆయన చేసిందని ఎద్దేవాచేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో శనివారం ఆయన మాట్లాడారు.
‘‘ఐదేళ్ల పాటు రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది. మాటలు చెప్పి ఆకట్టుకోవడమే నరేంద్రమోదీ చేస్తున్నది. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాకు 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు 100కూడా వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లలో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే.. కేంద్రంలో మన మాట చెల్లుబాటవుతుంది. దిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం’’ అని కేటీఆర్‌ అన్నారు. రోడ్‌షోలో ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.