జాతీయం

మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి..

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హసన్‌, మండ్య, తుమకూరు లోక్‌సభ నియోజక వర్గాలపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూడు స్థానాల్లో మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి చెందిన వారు పోటీకి దిగారు. అయితే, తుమకూరు నుంచి దేవెగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజీకీయ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన… అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.కర్ణాటక సీఎంగా,  భారత ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించారు.

మొదట కర్ణాటకలోని హోళెనరసిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా దేవెగౌడ ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం కూడా మరో ఐదు సార్లు అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లోనూ హసన్ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన.. ఈ స్థానం నుంచి ఈ సారి తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణను ఈ స్థానం నుంచి బరిలోకి దింపారు. ప్రజ్వల్‌ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. కాగా, దేవెగౌడ మరో మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కూడా మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్ధి, సినీ నటి సుమలత చేతిలో ఓటమి దిశగా కొనసాగుతున్నారు.