సినిమా

మహేశ్‌ భామ డ్యాన్స్‌తో అదరగొట్టింది

ముంబయి: బాలీవుడ్‌ నటులు వరుణ్‌ధావన్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌, మాధురీ దీక్షిత్‌, సోనాక్షి సిన్హా, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌, సాజిద్‌ నదియాద్‌వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీతమ్‌ బాణీలు అందించారు. ఏప్రిల్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ ఆసక్తిని పెంచింది.

శుక్రవారం ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తో కలిసి నటి కియారా అడ్వాణీ ఆడిపాడారు. ఆమె డ్యాన్స్‌, హావభావాలకు విశేషమైన స్పందన లభిస్తోంది. ‘ఫస్ట్‌ క్లాస్‌’ అని సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో ఉంది. కియారా తన డ్యాన్స్‌తో అదరగొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. పలువురు ప్రముఖులు సైతం కియారాను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. వీరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ సినిమాలోని ప్రత్యేక గీతానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు’ అని చిత్ర బృందానికి కూడా ఆమె థాంక్స్‌ చెప్పారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాతో కియారా నటిగా టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.