సినిమా

మహేశ్‌ కోసం దర్శకులంతా ఒకే వేదికపై?

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను భారీగా ప్లాన్‌ చేయబోతున్నారట. మే 1న నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరగబోతోంది. అయితే వేడుకకు అతిథులుగా.. మహేశ్‌ ఇప్పటివరకు నటించిన 24 సినిమాల దర్శకులంతా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ కెరీర్‌లో ‘మహర్షి’ ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఇది ఆయన నటిస్తున్న 25వ సినిమా. దాంతో సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండాలని చిత్రబృందం భావించిందట.
1999లో ‘రాజకుమారుడు’ చిత్రంతో మహేశ్‌ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కే.రాఘవేంద్రరావు నుంచి 2019లో విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి వరకు మహేశ్‌తో కలిసి పనిచేసిన అందరు దర్శకులు ఒకే వేదికపై కనువిందుచేయబోతున్నారని సమాచారం. అదే నిజమైతే.. చరిత్రలో ఇలాంటి ప్రత్యేకమైన ఈవెంట్‌ను ఏర్పాటుచేసిన ఏకైక చిత్రబృందం ఇదే  అవుతుంది.
దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘మహర్షి’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.