క్రైమ్తెలంగాణ

మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

రామచంద్రాపురం (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ని ఆమె ప్రియుడు హత్య చేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సీఐ రామచంద్రరరావు, బాధితురాలి తండ్రి సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌, సదాశివపేట మండలం మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందారిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ క్రమంలో హత్నూర పోలీస్‌ స్టేషన్‌కి ప్రకాశ్‌, రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌కి మందారిక బదిలీ అయ్యారు. అయినప్పటికీ వీరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం విధులు నిర్వహించుకొని మందారిక, ప్రకాశ్‌ బయటకు వెళ్లారు. మందారిక ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆమె తండ్రి రామంచద్రాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రకాశ్‌ను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఆమెను హత్య చేసి పెట్రోలు పోసి తగలబెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం సహించలేక ఆమెను హత్య చేసినట్లు సమాచారం.