తెలంగాణ

మహాకూటమి నూరు శాతం ఫలప్రదం అవుతుంది…

ఖానాపురం హవేలి (ఖమ్మం): తెలంగాణలో నియంతృత్వ పాలనకు విసుగు చెందిన ప్రజలు ప్రజా కూటమి గెలుపును కోరుకుంటున్నారని ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తున్న మహాకూటమి బలపరచిన తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెదేపా భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో మొదట తానే ఓటు వేశానని గుర్తుచేశారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందన్నారు. అభివృద్ధి లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు కల్పించటంలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం సాధించామని.. అయితే తెరాస ప్రభుత్వం వాటి సాధనలో విఫలమైందని ఆరోపించారు. ఖమ్మం నియోజక వర్గ ప్రజలు తన విజయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకున్నారనడం సరికాదని నామా అన్నారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబుపై తెరాస విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. మహాకూటమి నూటికి నూరు శాతం ఫలప్రదమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా తెదేపా అధ్యక్షుడు బ్రహ్మయ్య, ఉపాధ్యక్షుడు కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.