తెలంగాణ

మల్కాజ్‌గిరిలో మద్దతివ్వండి : రేవంత్‌

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అక్కడి నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్‌గిరి పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గ భాజపా నాయకుడు గణేశ్‌తో మంగళవారం రేవంత్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని, పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని రేవంత్‌ గణేశ్‌ను కోరారు. గతంలో గణేశ్‌కు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్న రేవంత్‌.. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాబోవని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, భాజపా మధ్యనే ఉండబోతోందన్నారు. ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి గతంలోనూ 16 మంది ఎంపీల బలం ఉంచుకొని ఏమీ చేయలేకపోయిన కేసీఆర్‌.. భవిష్యత్తులో మాత్రం ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు. కంటోన్మెంట్‌లో ఆర్మీకి సంబంధించిన ఏఓసీ గేట్లు తెరుస్తామని, రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గణేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు.