అంతర్జాతీయం

మరో కార్గిల్ యుద్ధం జరుగుతుందా?

దిల్లీ: సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధం గుర్తుండే ఉంటుంది. పాకిస్థాన్‌ సైన్యం నియంత్రణ రేఖను దాటుకుని భారత్‌లోకి ప్రవేశించింది. తొలుత ఇది తిరుగుబాటు దారుల పనే అనుకున్నప్పటికీ దీని వెనకఉన్న పాకిస్థాన్‌ కుటిల బుద్ధి తర్వాత వెల్లడైంది. ఈ ఏడాది పుల్వామా ఘటన జరిగిన తర్వాత భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో మళ్లీ పాక్‌ కార్గిల్‌ లాంటి యుద్ధానికి పాక్‌ కాలు దువ్వే అవకాశం ఉందా? అని మీడియా ఆర్మీ చీఫ్ బిపిన్‌ రావత్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ..

‘పాకిస్థాన్‌ ఆక్రమించుకోవాలని చూడటానికి ఇక్కడ స్థలం మిగిలిలేదు. నాకు తెలిసి పాకిస్థాన్‌ ఇంకోసారి అలాంటి చర్యలు తీసుకోదని అనకుంటున్నాను. పాక్‌ యుద్ధానికి దిగే ధైర్యం చేయదు. ఎందుకంటే గతంలో యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆ దేశానికి బాగా తెలుసు’ అని అన్నారు.

1999లో మే-జులై వరకు జరిగిన కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ దాదాపు 30 వేల మంది సైనికులను మోహరించి అమీతుమీకి సిద్ధమైంది. మేజర్ జనరల్ వేద్‌ ప్రకాష్ మాలిక్ నేతృత్వంలోని భారత వీరజవాన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. ఈ పోరాటంలో 527 మంది మరణించారని, 1,363 మంది గాయపడ్డారని భారత్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ లెక్కలు మరో విధంగా ఉన్నాయి. 4 వేల మంది వరకు మరణించారని ఆ దేశం లెక్కలు కట్టింది. 665 మందికి పైగా గాయాల పాలయ్యారని చెబుతోంది.