జాతీయం

మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ.. ఎందుకంటే?

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మరోసారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మమత వెళ్తున్న కాన్వాయ్‌కి కొంతమంది ఇతర పార్టీ కార్యకర్తలు అడ్డుపడడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నినాదాలు చేస్తూ ఆమెను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యకర్తల చేష్టలతో ఆగ్రహానికి గురైన ఆమె కారు దిగి వారిని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ‘‘మా కాన్వాయ్‌ వెళ్తుండగా.. బిజెపి రిబ్బన్లు నుదుటికి ధరించిన కొంతమంది వ్యక్తులు అడ్డుపడ్డారు. వారు బయటి నుంచి వచ్చిన వారు. స్థానిక ప్రజలు కాదు. హిందీ మాట్లాడే ప్రజలతో నాకు ఎలాంటి వైరం లేదు. కానీ బెంగాల్‌ ప్రాంతానికి చెందని కొంతమంది రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సందర్భంలోనూ వారు ఇలాంటి హింసాత్మక ఘటనలకే ఒడిగట్టారు. రాష్ట్ర వనరులను వినియోగించుకుంటూనే నన్ను వ్యతిరేకించే సాహసం చేస్తున్నారు’’ అని మమత అన్నారు. తిరిగి ఆమె బయలుదేరుతున్న సమయంలోనూ కార్యకర్తలు మళ్లీ నినాదాలు చేయడం గమనార్హం.

అయినా కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్థానికులకు, బెంగాలీయేతరులకు మధ్య కొంతమంది చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2021లో భాజపా ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా బారక్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. అనంతరం వెలువడిన ఫలితాల్లో ఆ సీటును భాజపా కైవసం చేసుకోవడం గమనార్హం.