తెలంగాణ

మరణంలోనూ వారి పేగు బంధాన్ని వీడలేదు

స్నేహ టీవీ (మంచిర్యాల): తల్లి కడుపున పేగు తెంచుకు పుట్టిన అక్క, తమ్ముడు మరణంలోనూ వారి పేగు బంధాన్ని వీడలేదు. అక్క చనిపోయిన అరగంటకు తమ్ముడు మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం…  గ్రామానికి చెందిన ఉగ్గె నాగవ్వ(50)కు పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత కుటుంబ కలహాలతో ఆమె భర్తను వదిలి తల్లిగారి ఊరు గూడెంలో ఉంటోంది. ఈమె సోదరుడు నాగన్న(40)కు పెళ్లి కాలేదు. వీరిద్దరికి మరో సోదరుడు రాజన్న ఉన్నాడు. ఇతడికి పెళ్లయిన తర్వాత కుటుంబ కలహాలతో భార్యను అత్తవారింటి వద్దనే ఉంచాడు. దీంతో రాజన్న, నాగవ్వ, నాగన్న ముగ్గురు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

నాగవ్వ గత రెండు నెలలుగా అనారోగ్యానికి గురయ్యింది. నాగన్న గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లలేదు. ఇద్దరు మంచం పట్టారు. దీంతో పరిస్థితి విషమించి శనివారం ఉదయం 7గంటలకు నాగవ్వ మృతి చెందింది. మరో అరగంట వ్యవధిలో నాగన్న మృతి చెందాడు. ఒకే రోజు ఒకే ఇంట్లో అక్కా, తమ్ముడు మృతి చెందడం పలువురిని కలిచివేసింది. బంధువులు, గ్రామస్తులు కలిసి ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించారు