అంతర్జాతీయం

మన హెలికాప్టర్‌ను మనమే కూల్చామా!

ఫిబ్రవరి 27వ తేదీన  పాకిస్థాన్‌తో వైమానిక ఘర్షణ జరుగుతున్న సమయంలో బుద్గాం వద్ద భారత వాయుసేనకు చెందిన ఒక ఎంఐ-17హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్‌ ఎలా కూలిపోయిందనడానికి చాలా రోజుల వరకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీని ప్రారంభించారు. దీనిలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు ఓ ఆంగ్లపత్రికలో కథనం వచ్చింది. వైమానిక ఘర్షణ సమయంలో ఈ హెలికాప్టర్‌ గాల్లోకి లేవడంతో భారత గగనతల రక్షణ వ్యవస్థలే దీనిని పొరబాటున పేల్చేశాయనే అప్పటి పరిస్థితులు చెబుతున్నాయి. దీనికి చాలా నిర్లక్ష్యాలు కూడా కారణమైనట్లు తేలింది.
గాల్లో విమానాలను ఎలా గుర్తిస్తారు..
స్వదేశీ, మిత్రదేశాల విమానాలు గుర్తించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వాయుసేనలు పలు విధానాలను అవలంభిస్తున్నాయి. చూసి గుర్తుపట్టడం, రేడియో ట్రాన్స్‌మిషన్‌, విమానం ప్రయాణం ఆరభించే, ముగించే స్థానాలను బట్టి, ట్రాన్స్‌పాండర్ల ఆధారంగా మిత్ర, శత్రు విమానాలను పసిగట్టే వ్యవస్థ (ఐఎఫ్‌ఎఫ్‌)ద్వారా గుర్తిస్తారు. విమానంలో ఉండే ట్రాన్స్‌పాండర్‌ పరికరం భూమి పై ఉన్న మిగిలిన రాడార్లకు ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో సమాచారం పంపిస్తుంది. అంతేకాదు విమానం వేగం, విమానంతో సమన్వయం ఆధారంగా కూడా గుర్తిస్తుంది. దీనిని సాధారణంగా సివిల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ వాణిజ్య విమానాలను గుర్తించేందుకు వాడతారు. సంక్షోభ సందర్భాల్లో విమానం ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల పరిధిలోకి వెళ్లకుండా ప్రయాణించాల్సిన సురక్షిత మార్గాలను చెబుతారు.
ఆ రోజు ఏం జరిగింది..
ఫిబ్రవరి 27 ఎంఐ-17 హెలికాప్టర్‌ బుద్గాం వద్ద మారుమూల ప్రదేశంలో కుప్పకూలింది. ఆ ప్రదేశం నుంచి బ్లాక్‌ బాక్స్‌(ఫ్లైట్‌ డేటా రికార్డర్‌) అదృశ్యమైంది. ఏ విమాన ప్రమాదాన్ని విశ్లేషించాలన్నా ఇది చాలా ముఖ్యం. దీంతో ఈ ప్రమాదంపై విచారణలో జాప్యం జరిగింది. దీంతో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీలో అక్కడి పరిస్థితుల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఇక్కడో ప్రమాదకర విషయం వెల్లడైంది. వాయుసేకు చెందిన హెలికాప్టర్‌ను వాయుసేనకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలైన పైథాన్‌ , డెర్బే, స్పైడర్‌లలో ఏదో ఒకటి పొరబాటున కూల్చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

స్విచ్చాఫ్‌లో ఐఎఫ్‌ఎఫ్‌..
విధుల్లో ఉన్న పలువురు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది చోటు చేసుకొందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కీలకమై హెలికాప్టర్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌ వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసి ఉంచారు.  ఒక పక్క సరిహద్దుల్లో వైమానిక ఘర్షణ జరుగుతుంటే ఈ వ్యవస్థను ఎందుకు స్విచ్చాఫ్‌ చేశారో తెలియటంలేదు. దీంతో గగనతల రక్షణ వ్యవస్థలు ఈ హెలికాప్టర్లను శత్రువర్గానికి చెందినదిగా భావించి పేల్చివేశాయి. వాస్తవానికి గత ఏడాది ఐఏఎఫ్‌ ఒక మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ప్రకారం భారత భూభాగంలోకి వచ్చే ఏ విమానం అయినా ఐఎఫ్‌ఎఫ్  స్విచ్‌ఆన్‌ చేసి ఉంచాలి. దీనికితోడు హెలికాప్టర్‌ గాల్లోకి లేచిన తర్వాత వెంటనే దానిని వెనక్కి రమ్మని పిలిచారు. ఈ క్రమంలో గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండా సురక్షితంగా వచ్చే మార్గాన్ని మాత్రం సూచించలేదన్న విషయం కోర్ట్ ఆఫ్‌ ఎంక్వైరీలో తేలింది. దర్యాప్తు ముందుకు పోయేకొద్దీ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.