జాతీయం

మనకూ ఒక స్పేస్‌స్టేషన్‌

అంతరిక్షంలో భారత్‌కు ప్రత్యేకంగా స్పేస్‌ స్టేషన్ ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ గురువారం వెల్లడించారు. ఆ స్పేస్‌ స్టేషన్ గురించి ఆయన మాట్లాడుతూ..‘అది ఒక చిన్న మాడ్యూల్‌గా ఉండనుంది. దాన్ని ముఖ్యంగా మైక్రో గ్రావిటీ పరిశోధనల కోసం ఉపయోగించనున్నాం. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు కొనసాగుతున్నాయి. అయితే 2022లో గగన్‌యాన్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తరవాత దానిపై ముందుకు వెళ్లనున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఆ ప్రాజెక్టుకు ఒక రూపు ఇవ్వడానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పట్టే అవకాశముందన్నారు. దానికి ఎంత ఖర్చవుతుందన్నదానిపై ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు.

‘ప్రస్తతం మా దృష్టంతా జులైలో జరిగే చంద్రయాన్-2, 2022లో జరిగే గగన్‌యాన్ ప్రయోగం మీదే ఉంది. గగన్‌యాన్ మొదటి మానవ సహిత అంతరిక్షయాత్ర’ అని ఆయన వెల్లడించారు. గగన్‌యాన్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఎంపిక మరో ఆరునెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వారికి సుమారు రెండు సంవత్సరాలు పాటు కఠిన శిక్షణ ఇవ్వనున్నారు.