ఆంధ్రప్రదేశ్

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడం: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటంలేదని ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలో శిక్షణ పొందిన నూతన ఎక్సైజ్‌ పోలీస్‌ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న 42 మందికి ఆయన ధ్రువపత్రాలు అందజేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి దశలో మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నిర్మూలిస్తామని.. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమ ప్రభుత్వానికి అవసరం లేదని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. మద్యానికి బానిసలై భర్తలను పోగొట్టుకొన్న మహిళలు వితంతువులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నవరత్నాలు హామీలో భాగంగా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని, దీన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని స్పష్టంచేశారు. పలమనేరులో జరిగిన పరువు హత్యను ఖండించారు. కేసును వేగంగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

అవినీతిని సీఎం సహించరు: చెవిరెడ్డి
అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలను ముఖ్యమంత్రి ఏమాత్రం సహించబోరన్నారు. అధికారులందరూ నీతి, నిజాయతీలతో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శిక్షణలో ఉన్న పోలీసులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ట్రెయినింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.సూర్యభాస్కరరెడ్డి, ట్రెయినీ కళాశాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.