జాతీయం

మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు: మంత్రి నిరంజన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్: తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి నేడు సందర్శించారు. నిన్న అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. వర్షానికి తడిసిన ప్రతిగింజను కొనుగోలు చేస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. అధికారులు నిరంతరం రైతుల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. గోనె సంచుల సరఫరాలో కొంతజాప్యం జరిగిందన్నారు. గోనె సంచులు బంగ్లాదేశ్ నుంచి రావాల్సి ఉన్నందున ఈ జాప్యం జరిగిందన్నారు. ధాన్యం తూకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కమీషన్లు తీసుకున్నా, మద్దతుధర కంటే తక్కువకు కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పని అధికారులను హెచ్చరించారు.