అంతర్జాతీయం

మండ్యలో సుమలత, నిఖిల్‌ వర్గీయుల ఘర్షణ

మండ్య: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఓటర్లు ఆందోళనకు దిగగా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. కర్ణాటకలోని మండ్యలో అభ్యర్థులు సుమలత, నిఖిల్‌ కుమారస్వామి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

మండ్యలోని ఓ పోలింగ్‌ కేంద్రం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. గెలుపు విషయంలో సుమలత, నిఖిల్‌ వర్గీయులు పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి అది ఘర్షణకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గీయులు దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఈ ఎన్నికల్లో మండ్య పోరు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, దివంగత ఎంపీ అంబరీష్‌ మరణంతో ఆయన సతీమణి, ప్రముఖ నటి సుమలత రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించినప్పటికీ.. పొత్తులో భాగంగా మండ్య స్థానం జేడీఎస్‌కు వెళ్లింది. దీంతో అసంతృప్తికి గురైన ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అటు జేడీఎస్‌ తరఫున సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ మండ్య నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలవడం కూడా నిఖిల్‌కు కూడా ఇదే తొలి సారి. అంతేగాక ఆయన పలు కన్నడ సినిమాల్లో నటించారు. దీంతో మండ్య ఎన్నిక రసవత్తరంగా మారింది.