క్రైమ్

మంటలకు ఎన్నో ‘కారు’ణాలుంటాయ్‌!

 ఇటీవల హయత్‌నగర్‌లో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారు యజమాని తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వేసవిలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండటం సహజం. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కార్ల డోర్లు సైతం అంత త్వరగా తెరుచుకునేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అదే జరిగితే మరింత ప్రమాదం సంభవించొచ్చు. అందువల్ల తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

 గత నెలలోనూ సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే నగర శివారు ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలో సంభవించింది. ఉన్నట్టుండి కారులో మంటలు చెలరేగడంతో కారు డోర్లు మూసుకుపోయాయి. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కనీస జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి ఘటనలు జరగకుండా ముందుగానే నిలుపుదల చేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఉపకరణాలు బిగించే ముందు..
కారు కొనగానే దాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు చాలామంది రకరకాల ఉపకరణాలను బిగిస్తూ ఉంటారు. స్పీకర్లు, ఎల్‌ఈడీ బల్బులు, వినూత్నమైన హారన్లు అంటూ హడావుడి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి అమర్చే ముందు వాటిపై ఉన్న సూచనలను క్షుణ్నంగా చదవాల్సిన అవసరం ఉంది. ‘కార్లలో వినియోగించరాదు’ అని రాసున్న వాటిని కొనకపోవడమే మంచిది. అదనంగా ఏర్పాటు చేసుకుంటున్న ఈ ఉపకరణాల వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఏర్పడితే అగ్నిప్రమాదం జరగొచ్చు. వైర్లను సక్రమంగా బిగించకున్నా షార్ట్‌సర్క్యూట్‌కు ఆస్కారముందని, 2/3వ వంతు ప్రమాదాలకు ఇదే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నైపుణ్యమున్న మెకానిక్‌ సూచనలతో నాణ్యతగల ఉపకరణాలను అమర్చుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని సూచిస్తున్నారు.

ఇంధనం లీకేజీపై..
వాహనాల్లో జరుగుతోన్న అగ్నిప్రమాదాలకు సుమారు 15 శాతం ఇంధనం లీకేజీలే కారణం. పెట్రోల్‌, డీజిల్‌ నిల్వ ఉండే ట్యాంకు, ఇంజిన్‌కు అది ప్రసరించే వ్యవస్థను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. కారుతోపాటు వచ్చే గ్యాసు (సీఎన్‌జీ) కిట్లు పక్కాగా ఉంటాయి. కానీ కొందరు ఇంధనం ఆదా చేయాలన్న ఉద్దేశంతో కారుకు పెట్రోల్‌, డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ కిట్లను తర్వాత బిగించుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్యాసు లీకేజీ జరిగి ప్రమాదాలు వాటిల్లొచ్చు. ఇంజిన్‌ ఆయిల్‌ మార్చే ప్రక్రియలో కొంత కారుపై చిందుతుంది. వాహనాన్ని స్టార్ట్‌ చేసే ముందు దీనిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంజిన్‌ నుంచి ఇంధనం, ఆయిల్‌ లీకేజీ ఉన్నా, వాహనం నడిచేటప్పుడు మెటల్‌, రబ్బరు కాలిన వాసన వచ్చినా, ఇంజిన్‌ నుంచి టక్‌టక్‌మని శబ్ధాలొచ్చినా మంటలు వచ్చే అవకాశముందని గుర్తించాలి.

ఇవి పాటించండి: హరి, మెకానిక్‌
 కార్లు, ఇతర వాహనాలేవైనా చెట్టునీడ, షెడ్లలో నిలపడం మంచిది.
 మంటలు ఆర్పే పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
 పొగలు వచ్చినప్పుడు హెచ్చరించే (స్మోక్‌ డిటెక్టర్స్‌) పరికరాలను అమర్చుకోవాలి.
 డియోడ్రెంట్లు, ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు, ఇతర స్ప్రేలు, సిగార్‌ లైటర్లకు మండే గుణం ఉంది కనుక వీటిని కారులో ఉంచొద్దు.
 పెట్రోల్‌, డీజిల్‌, గ్యాసు సిలిండర్ల వంటి వాటిని రవాణా చేయకపోవడం మంచిది.
 ప్రయాణం చేస్తున్నపుడు పొగ తాగకపోవడం శ్రేయస్కరం.
  కారు మ్యానువల్‌ ప్రకారం నిర్ణీత కాలంలో ఎప్పటికప్పుడు మెకానిక్‌తో మరమ్మతులు చేయించాలి.
 సుదూర ప్రయాణాలు చేసేటపుడు అక్కడక్కడ వాహనాన్ని కాసేపు ఆపితే ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
 ఇంజిన్‌ను చల్లబరిచేందుకు రేడియేటర్‌లో నీరు ఉండేలా చూసుకోవాలి.
 వాహనాలు ఢీకొన్నప్పుడు మంటలు చెలరేగే ప్రమాదముంది. అందుకే నెమ్మదిగా వెళ్లడం ఉత్తమం.