ఆంధ్రప్రదేశ్

భార్యను కడతేర్చిన భర్త

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను హతమార్చేశాడు. పైగా తనకేమీ తెలియదన్నట్లు.. భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి ఆమె శవమై కనిపించడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కంకిపాడులో నివసిస్తున్న కానుమోలు శివనాగరాజు, శిరీషా(31)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు బాబు, పాప ఉన్నారు. శివనాగరాజు తల్లి గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. దీంతో జూన్‌ 26వ తేదీన అత్తను చూసేందుకు శిరీషా ఆసుపత్రికి వచ్చింది. జూన్‌ 27 ఉదయం నుంచి తన భార్య కనిపించడం లేదంటూ భర్త ఆత్కూరు పోలీసు స్టేషన్‌లో జూన్‌ 29వ తేదీన ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలోని బుడమేరు తూముల దగ్గర మృతదేహం ఉందంటూ గ్రామ వీఆర్వో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విచారించగా.. అదృశ్యమైన శిరీషా మృతదేహంగా తేలింది. గన్నవరం సీఐ వై.రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివనాగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో ఆసుపత్రిలో తల్లిని పరామర్శించేందుకు వచ్చిన భార్యను ఇంటికి తీసుకెళుతున్న సమయంలో.. మార్గమధ్యంలో రాడ్డుతో భార్యను తానే కొట్టి చంపానని, మృతదేహాన్ని పంటల కాల్వ తూములో పెట్టానని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు.