జాతీయం

బెంగాల్‌లో ఆరో విడతలోనూ హింస

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో  బిజెపి, తృణమూల్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతోఈ ఆరోదశకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

బిజెపి అభ్యర్థిపై దాడి..
ఘటాల్‌ లోక్‌సభ నియోజకవర్గ  బిజెపి అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు. నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆమె మరో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో భారతి కంటతడి పెట్టారు. భారతి వాహనంపైనా కొందరు దాడికి పాల్పడ్డారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని  బిజెపి కార్యకర్తలు ఆరోపించారు.

బిజెపి కార్యకర్త దారుణ హత్య..
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు  బిజెపికు చెందిన బూత్‌ కన్వీనర్‌ హత్యకు గురయ్యాడు. ఝార్గామ్‌ జిల్లాలోని గోపీబల్లాబ్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి తీవ్రగాయాలతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని రమణ్‌సింగ్‌గా పోలీసులు గుర్తించి ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై  బిజెపి జాతీయ కార్యదర్శి కైలేష్‌ విజయ్‌వర్గీయా మండిపడ్డారు. తృణమూల్‌ కార్యకర్తలే రమణ్‌సింగ్‌ను హతమార్చారని  ఆరోపించారు.  బిజెపి కార్యకర్త ఇంట్లోకి టీఎంసీ కార్యకర్తలు చొరబడి దారుణంగా హత్య చేశారని.. భాజపా బూత్‌ కన్వీనర్‌ అయినందునే ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

బిజెపి కార్యకర్తలపై కాల్పులు..
మరో ఘటనలో తూర్పు మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో ఇద్దరు భాజపా కార్యకర్తలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రాష్ట్రంలోని 8 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.