క్రైమ్జాతీయం

బెంగళూరు లో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరు: ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతున్న బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 300కిపైగా కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది.

పార్కింగ్‌ ప్రదేశంలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. ఏరో ఇండియా గేట్‌ నంబరు 5 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్ద ఏడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. పార్కింగ్‌ చేసిన ఓ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.

‘ఒక కారు తర్వాత ఒకటి పేలిపోవడం ప్రారంభించింది. చాలా పెద్ద శబ్దం వినిపించింది. సెకన్ల వ్యవధిలోనే పార్కింగ్‌లో ఉన్న వేరే కార్లకు మంటలు వ్యాపించాయి. టైర్లు పేలిపోయాయి. నాకు భయం వేసింది. దీంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాను. అదే సమయానికి అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి’ అని రహీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. పార్కింగ్‌లో ఉంచిన చివరి కారు నుంచి తొలుత మంటలు వచ్చినట్లు అతడు చెబుతున్నాడు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.