ఆంధ్రప్రదేశ్

బుల్లెట్‌తో అధికారం అసాధ్యం..

  • బుల్లెట్‌తో అధికారం అసాధ్యం
  • ప్రజాస్వామ్యం నిలబడేది బ్యాలెట్‌తోనే
  • సంఘ విద్రోహులతో అప్రమత్తం
  • ప్రజలతో స్నేహంగా మెలగాలి
  • వారి మనసుల్లో స్థానం పొందాలి
  • పోలీసులకు ఉపరాష్ట్రపతి పిలుపు
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘బుల్లెట్‌తో అధికారం సాధ్యం కాదు.. ప్రాణాలు పోతాయి అంతే.. బ్యాలెట్‌ ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. హరితాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వనం-మనం కార్యక్రమం స్ఫూర్తితో నవ్యాంధ్ర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 12.27 లక్షల మొక్కలు నాటారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన పోలీసులకు మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉప రాష్ట్రపతి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింసాత్మక సంఘటనలు సరికాదన్నారు. మావోయిస్టులైనా.. ఇంకెవరైనా తుపాకీలు, తూటాలతో అధికారం సాధించడం అసాధ్యమని చెప్పారు. సమాజంలో కులం, మతం, ప్రాంతం, వర్గం.. ఇలా అన్ని మార్గాల్లోనూ రెచ్చగొట్టేవారుంటారని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల పట్ల జాగరూకతతో ఉండాలని కోరారు. ‘ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతిని ప్రేమించడం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. ప్రశాంత సమాజంతోపాటు పచ్చని ప్రకృతి కోసం కృషి చేసిన పోలీసులు అభినందనీయులు. ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే పోలీసుల త్యాగం వల్లే. అయితే ఆ త్యాగాన్ని ప్రజలు గుర్తించేలా పోలీసుల వ్యవహారం ఉండాలి. అధికారం, లాఠీలతో వారి మనసుల్లో స్థానం సంపాదించడం సాధ్యం కాదు. సంఘవిద్రోహ శక్తులతో కఠినంగా వ్యవహరించే పోలీసులు ప్రజలతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండాలి. తమ కోసం పోలీసులు ప్రాణత్యాగం చేస్తున్నారనేది వారిలో బలపడాలి. పోలీసు స్టేషన్‌కు వెళ్తే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాగా పెరగాలి’ అని ఆకాంక్షించారు. ఒత్తిళ్లకు లొంగకుండా చట్టప్రకారం పనిచేస్తున్న పోలీసులు ఎందరో ఉన్నారని, ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుంటే పోలీసుశాఖ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపారు.
నాడు బస్సుపై రాళ్లేశా..
విద్యార్థి దశలో తాను ఆర్టీసీ బస్సుపై రాళ్లేశానని, అప్పట్లో నెల్లూరు జిల్లా ఎస్పీ తనను పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఆవేశం తగ్గిపోయి ఆలోచన పెరిగిందని వెంకయ్య వెల్లడించారు. హింసాయుత మార్గంలో పయనించే వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులకైనా, ప్రజలకైనా రాజ్యాంగమే బాస్‌ అని, చట్టాలను గౌరవించి నడుచుకుంటేనే చట్టాలకు విలువ ఉంటుందని చెప్పారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ప్రశాంత రాష్ట్రంతోపాటు పచ్చని ప్రకృతి కోసం తాము పనిచేస్తున్నామన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉంటున్నామని, టెక్నాలజీని అందిపుచ్చుకుని సీసీ కెమెరాలతో నిఘా, డ్రోన్లతో పర్యవేక్షణ.. ఎల్‌హెచ్‌ఎంఎ్‌సతో దొంగలకు చెక్‌ పెడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పది లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని నెల రోజుల్లో 12.27 లక్షల మొక్కలు నాటామన్నారు.
వాటిని జాగ్రత్తగా సంరక్షించి అందులో 88 శాతం(10.77లక్షలు) మొక్కలను బతికించున్నట్లు వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు, పోతురాజు (అవనిగడ్డ), సుధాకర్‌ యాదవ్‌ (గోరంట్ల), సాంబమూర్తి (నరసాపురం), కేశవ్‌ (చిత్తూరు జిల్లా) ఉప రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరావు, పీసీసీఎఫ్‌ మహ్మద్‌ ఇలియాస్‌ రిజ్వీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.