తెలంగాణ

‘బిగ్‌బాస్‌3’ తెలుగు హోస్ట్‌ ఈయనే!

బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ‘బిగ్‌బాస్‌3’కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను స్టార్‌ మా అభిమానులతో పంచుకుంది.

మార్కెట్‌కు వచ్చిన నాగార్జునను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, కిలోల కొద్దీ కూరగాయలు, వంట సామాగ్రి ఆర్డర్‌ చేస్తూ కనిపించారాయన. చివర్లో ‘మీరు వచ్చారేంటి సర్‌’ అని ఓ దుకాణదారు అడిగితే ‘ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో 14మంది బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లనున్నారు. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండోదానికి నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సీజన్‌ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌ విజేతగా కౌశల్‌లు నిలిచారు. మరి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లేది.. విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!