ఆంధ్రప్రదేశ్

బాలికపై కీచకపర్వం: ఆరుగురి అరెస్టు

ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌  ఆదివారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు.

‘‘పరిచయస్థుడిని కలిసేందుకు ఈనెల 16న బాలిక ఒంగోలు వచ్చింది. ఒంగోలు బస్టాండ్‌లో అతని కోసం వేచి చూస్తున్న బాలికను చరవాణి మెకానిక్‌ బాబూరావు ట్రాప్‌ చేశాడు. మాయ మాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లాడు. ఆతర్వాత తన ఆరుగురి స్నేహితులతో కలిసి శనివారం వరకు ఆత్యాచారం చేశారు. నిందితుల బారి నుంచి తప్పించుకున్న బాలిక బస్టాండ్‌లో రోదిస్తూ కూర్చుంది. నిన్న సాయంత్రం బస్టాండ్‌లో ఏడుస్తున్న బాలికను హోంగార్డు వెంకటేశ్వర్లు గమనించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. దీంతో విషయం వెలుగు చూసింది. సమాచారం అందగానే అప్రమత్తమయ్యాం. శక్తి టీంకు సమాచారమిచ్చి, వారి సాయంతో నిందితులను గుర్తించడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. రైలులో పరారయ్యేందుకు యత్నించిన ఓ నిందితుడిని బిట్రగుంట వద్ద పట్టుకున్నాం. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ప్రధాన నిందితుడిని షేక్‌ భాజీగా గుర్తించాం. బాలిక ఫిర్యాదు మేరకు ఏ1 షేక్‌ బాజీ, ఏ2 శ్రీనివాస్‌, ఏ6 మహేశ్‌, మరో ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేశాం. బాధిత బాలికను ఆసుపత్రికి పంపి వైద్య పరీక్షలు చేయించాం. మహిళలపై నేరాల నియంత్రణకు శక్తి బృందం చురుగ్గా పనిచేస్తోంది. రక్షక్‌, బ్లూకోర్టు బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి’’ అని జిల్లా ఎస్పీ తెలిపారు.