అంతర్జాతీయం

బాలాకోట్‌ జైష్‌ క్యాంప్‌లోకి మీడియా..!

43రోజుల పాటు సందర్శనకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులు ఏమిటీ..?
అదే నిజం అనుకుంటే.. వాతావరణ పరిస్థితులను తట్టుకొని గతంలో అక్కడికు వచ్చిన రాయిటార్స్‌ విలేకర్లను ఎందుకు అనుమతించలేదు..?
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 14 వరకు ఎందుకు సెలవులు..?
అక్కడ విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాపై ఆంక్షలు దేనికి..?

ఇవీ పాక్‌ అంతర్జాతీయ మీడియా, కొందరు దౌత్యవేత్తలను బాలాకోట్‌లో భారత్‌ దాడిచేసినట్లుగా పేర్కొంటున్న మదర్సాకు తీసుకెళ్లినప్పుడు తలెత్తిన సందేహాలు. వీటిల్లో దేనికీ సమాధానం లేదు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పబోయి పది ప్రశ్నలు సృష్టించినట్లు ఉంది పాక్‌ పరిస్థితి.
బీబీసీ(హిందీ) సహా ఇస్లామాబాద్‌లో ఉన్న మరికొన్ని అతర్జాతీయ మీడియా సంస్థలను బుధవారం పాకిస్థాన్‌ ప్రభుత్వం బాలాకోట్‌లో భారత్‌ దాడిచేసినట్లు చెబుతున్న మదర్సా సందర్శనకు తీసుకెళ్లాయి. ఈ సందర్శనకు ఐఎస్‌పీఆర్‌ మేజర్‌ జనరల్‌ ఆసీఫ్‌ గఫూర్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్శనకు ఇస్లామాబాద్‌ నుంచి ఒక హెలికాప్టర్‌లో విలేకర్ల బృందాన్ని తీసుకొని బాలాకోట్‌ సమీపంలోని మాన్సెరా వద్ద దించారు. అక్కడి అత్యంత కష్టమైన మార్గంలో దాదాపు గంటన్నర ప్రయాణించాక జైష్‌ క్యాంప్‌గా పేర్కొంటున్న మదర్సా వచ్చింది. ఆ ప్రదేశం అత్యంత నిర్మానుష్యంగా ఉంది. మసీదును తలపిస్తున్న ఆ క్యాంప్‌లో దాదాపు 150-200 మంది పిల్లలు ఖురాన్‌ చదువుతున్నారు. అక్కడ విదేశీ మీడియా ఫోటోలు తీసుకొంది. అనంతరం అక్కడి పిల్లలు, టీచర్లతో మాట్లాడాకా వారంతా స్థానికులేనని తెలిసింది. అక్కడ మదర్సా ప్రారంభంలో ఉన్న బోర్డుపై మసూద్‌ అజార్‌ బావ మౌలానా యూసఫ్‌ అజార్‌ పేరు ఉండటంపై ఐఎస్‌పీఆర్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ మదర్సాకు నిధులు, కోర్సులను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపారు.

అక్కడి వారితో మాట్లాడటంపై మీడియాకు అంక్షలు విధించారు. అతితక్కువ సమయం మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అక్కడి వారి మాటాలను బట్టి మదర్సా ఇంకా మూసే ఉందని, మీడియా సందర్శన సమయంలో అక్కడ ఉన్న పిల్లలు అంతా స్థానికులే అని తేలింది. అక్కడ ఉన్న బోర్డుపై మాత్రం ఫిబ్రవరి 27-మార్చి 14వరకు మదర్సా మూసేసినట్లు ఉంది.
అవునన్నా.. కాదన్నా.. బాలాకోట్‌ అంశం భారత ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం పాక్‌కు కూడా బాగా తెలిసినట్లుంది. అందుకే భారత్‌లోని 91 స్థానాలల్లో పోలింగ్‌కు ఒక్క రోజు ముందు మీడియాను బాలాకోట్‌ తీసుకెళ్లి అక్కడేం జరగలేదని చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.