జాతీయం

ఫైర్‌తో హెయిర్‌ కటింగ్‌.. !

ఇంటర్నెట్‌ డెస్క్‌ : జట్టుపై నిప్పు పెట్టి దాంతో విభిన్న ఆకృతులు సృష్టించడమే ఫైర్‌ హెయిర్‌ కటింగ్‌. హైదరాబాద్‌ వంటి మహానగరాల్లోనే అందుబాటులో ఉండే ఈ ఫైర్‌ కట్‌ను గ్రామీణ యువతకు చేరువ చేస్తున్నాడు నిర్మల్‌ జిల్లా నసీరాబాద్‌ గ్రామానికి చెందిన ఆనంద్‌.  క్షౌర వృత్తిపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లోని ఓ సంస్థలో మూడేళ్లపాటు శిక్షణ తీసుకున్న ఆనంద్‌.. గ్రామీణ యువతకు నూతన పోకడలను దగ్గర చేసే ఉద్దేశంతో  నిర్మల్‌లో ఓ క్షౌర శాలను ఏర్పాటు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో మాత్రమే చూసుకుని మురిసిపోయే ఫైర్‌ కటింగ్‌, క్యాండిల్‌ కటింగ్‌లను వారికి చేరువ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు.

పదేళ్లుగా నిర్మల్‌లోనే క్షౌరశాలను నడుపుతున్న ఆనంద్‌  నేటి యువతకు కొత్త రీతులను అందించేందుకే ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెబుతున్నాడు. ఫైర్‌ కటింగ్‌, క్యాండిల్‌ కటింగ్‌ కారణంగా గతంలో కంటే ప్రస్తుతం తన వ్యాపారం బాగా సాగుతోందని ఆనందం వ్యక్తంచేస్తున్నాడు. ఫైర్‌ కటింగ్‌, క్యాండిల్‌ కటింగ్‌ లాంటి కొత్త విధానాలు తమకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్థానిక యవకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.