జాతీయం

ఫలించిన బీజేపీ ‘యోగీ’ వ్యూహం !

శాంతి భద్రతల పేరుతో నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్లు.. పెచ్చరిల్లిన మూకదాడులు.. గో సంరక్షణ పేరుతో సెటైర్లు.. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ అధిష్ఠానం ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను మాత్రం మార్చలేదు. 2013 నుంచి ఆ రాష్ట్రంపై పూర్తి పట్టు పెంచుకొన్న పార్టీ నేత అమిత్‌షా ముఖ్యమంత్రి మార్పుపై కనీస ఆలోచన కూడా చేయలేదు. ఆ రాష్ట్రంలో అమలు చేయాల్సిన దీర్ఘకాలిక వ్యూహానికి సరైన వ్యక్తి యోగీనే అనే విషయం పార్టీ అధ్యక్షుడు అమిత్‌కు బాగా తెలుసు. విమర్శలు వచ్చిన ప్రతిసారి యోగీ ఆదిత్యనాథ్‌కు పార్టీ అండగా ఉంటూనే వచ్చింది. చివరికి అక్కడ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా సరే.. యోగీని మాత్రం మార్చలేదు. దీనికో కారణం ఉంది.. యోగీ ఆదిత్యనాథ్‌ ఒక నిబద్ధత గల బీజేపీ సైనికుడు. పార్టీ సిద్ధాంతాలకు, లక్ష్యాలకు పక్కుకు వెళ్లి ఏనాడు ఆయన పనిచేయరు.

ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పనిచేయడానికి యోగీకి మించిన ప్రత్యామ్నాయం బీజేపీ కు కనిపించలేదు. పైగా కేంద్రం పేదలకు అమలు చేసే సంక్షేమ పథకాలు చివరి వరకు చేరాలంటే ఆయన వంటి వారు అధికారం చేపట్టడం తప్పనిసరి. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించారు. దీనికి తగ్గటే యోగీ కూడా పనిచేశారు. ప్రభుత్వ పథకాలను చివరి వరకు తీసుకెళ్లారు.

పీఎంఏవై(జీ)లో యూపీలో 2017 మార్చి వరకు 5.58 లక్షల ఇళ్లు నిర్మించగా.. యోగీ అధికారం చేపట్టినప్పటి నుంచి మరో 6.82లక్షల ఇళ్లను నిర్మించారు.
* ఉజ్వల పథకం కింద కేంద్రం గ్రామీణ పేదలకు గ్యాస్‌ సిలిండర్లను ఇస్తోంది. 2017 మార్చి వరకు 55లక్షల సిలిండర్లు ఇవ్వగా.. యోగీ అధికారం చేపట్టిన రెండేళ్లలో మరో 74లక్షల సిలిండర్లు ఇచ్చారు.
* ఇక స్వచ్ఛభారత్‌ కింద మరుగు దొడ్ల నిర్మాణాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. యోగి అధికారం చేపట్టక ముందు 25లక్షల మరుగుదొడ్లను నిర్మించగా.. అధికారం చేపట్టాక 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు మరో 1.46 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ఈ విషయాన్ని భాజపా ఘన విజయంగా ప్రచారం చేసింది. తాను అధికారం చేపట్టిన రెండేళ్లకే టాయిలెట్ల నిర్మాణంలో యూపీ నెంబర్‌వన్‌గా నిలిచిందని యోగి ఓ సందర్భంలో అన్నారు.
* మహిళ భద్రత విషయంలో యోగీ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఫలితంగా మహిళలపై దాడులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు యోగీ ఆదిత్యనాథ్‌ పై అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. ఇది బీజేపీకు మరో అదనపు బలంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు విపరీతమైన వేగంతో అమలు చేయడంతో భారీ సంఖ్యలో పేదలు లబ్ధిపొందారు. వీరిలో అత్యధికులు బీసీలు, దళితులే. వీరంతా ఎస్పీ, బీఎస్పీ ఓటు బ్యాంక్‌.