జాతీయం

ప్రొటెం స్పీకర్‌..అయినా సైకిళ్లు అమ్ముతారు

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కొందరిలోనే ఉంటుంది. ఎన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగినా తాము ఎక్కిన మొదటి మెట్టును మాత్రం కొందరు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఇటీవల లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా  నియమితులైన వీరేంద్ర కుమార్‌ ఖటిక్‌దీ ఇదే తీరు. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు సైకిల్‌ షాప్‌ నిర్వహించేవారు. అదే ఆయనకు జీవనాధారం. 1980ల్లో ఆయన ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసేటప్పుడు ఓవైపు సైకిల్‌ షాపు నిర్వహిస్తూనే మరోవైపు ఏబీవీపీ కార్యకలాపాల్లో పాల్గొనే వారు.

ఎమర్జెన్సీ సమయంలో ఈయనకు 16 నెలలు జైలుశిక్ష పడింది. తర్వాత పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారి 1996లో తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. సాగర్‌ నియోజక వర్గం నుంచి ఆయన ఓటమి ఎరుగని నేతగా ఎదిగారు. 1996 నుంచి 2014 వరకు ఓడిపోకుండా వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయన సుమారు 6.72లక్షల ఓట్లు సంపాదించారు. ఆయన నిర్వహించిన సైకిల్‌ షాప్‌, సంఘ సేవలే ఆయనను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఎంత ఎదిగినా తన జీవితం మొదలయిన చోటును వదిలిపెట్టకూడదని ఇప్పటికీ సైకిల్‌ షాప్‌ను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఖాళీ సమయాల్లో సరదాగా ఆ దుకాణంలో కూర్చుని అమ్ముతారు కూడా. పూర్వపు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తన నియోజక వర్గం అంతా సైకిల్‌ లేదా స్క్రూటర్‌పైనే తిరుగుతారు. అయితే ఆ సమయంలో ఆయన వెంట ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అలా సైకిల్‌ మీద తిరుగుతూ తన స్నేహితులతో ముచ్చటించడం ఈయనకో వ్యాపకమట.