క్రైమ్

ప్రియురాలిపై హత్యాయత్నం

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో యువతిపై ఉన్మాది హత్యాయత్నానికి తెగబడ్డాడు. ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ చేయి కోసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌ (22), బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇద్దరికీ ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరి మధ్యా స్నేహం కొనసాగింది. వెంకటేశ్‌ ప్రవర్తన నచ్చని యువతి గత కొంతకాలంగా అతడిని దూరంగా ఉంచింది. దీంతో మనస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో 501 నంబర్‌ గదిని ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకున్నాడు.  మంగళవారం మనస్విని (22)కి ఫోన్‌ చేసి రావాలని కోరగా.. వారిద్దరూ కలిసి ఉదయం 10గంటల సమయంలో లాడ్జి వద్దకు చేరుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో మాటా మాటా పెరిగి ఈ దారుణానికి దారి తీసినట్టు తెలుస్తోంది.

పక్కా ప్రణాళికతోనే యువతిపై దాడి!

మనస్వినిపై కక్షపెంచుకున్న వెంకటేశ్‌  పథకం ప్రకారం తన వెంట తీసుకొచ్చిన కత్తితో యువతి గొంతు కోసి.. ఆపై తన చేయిని గాయపరుచుకున్నాడు. గదిలో యువతి కేకలు వేసింది. కేకలు విన్న ఫ్లోర్‌ బాయ్‌ గది తలుపులు తీసేందుకు ప్రయత్నించాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో దాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో మనస్విని పడిఉన్నట్టు గుర్తించాడు. వెంటనే మిగతా వారికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం యువతిని సమీపంలోని ఓమ్ని ఆస్పత్రిలో చేర్పించారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తన చేతిని గాయపరుచుకున్న వెంకటేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతీ యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

లాడ్జిలో రికార్డులు స్వాధీనం!

మనస్విని బీటెక్‌ పూర్తిచేసి బ్యాంక్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నట్టు సమాచారం. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బృందావన్‌ లాడ్జిలో రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఏ సమయంలో లాడ్జిలోకి వచ్చారు? ఏ పేరుపై వీరిద్దరి ప్రవేశానికి అనుమతించారు? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. హోటల్‌లోని  సీసీ కెమెరా దృశ్యాలను సేకరించారు. వారిద్దరి నుంచి వివరాలు సేకరించే పరిస్థితి లేకపోవడంతో లాడ్జి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.