తెలంగాణ

‘ప్రాణహిత..పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు’

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టు మరొకటి లేదని చెప్పారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించాలని త్వరితగతిన పూర్తి చేస్తే కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేయడం తగదన్నారు. కాళేశ్వరం పనులు కేవలం 15 శాతం మాత్రమే పూర్తయ్యాయంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను తలసాని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ అహోరాత్రులు సమీక్షలు చేశారన్నారు.