తెలంగాణవైద్యం

ప్రసూతి కేంద్రంగా.. బాలానగర్ పీహెచ్‌సీ

– పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు
– ప్రైవేట్‌కు ధీటుగా నిపుణులైన వైద్యులతో నిరంతర సేవలు

హైదరాబాద్: బాలానగర్ మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పూర్తి స్థాయి ప్రసూతి కేంద్రంగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు కటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలకే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేడు పూర్తి స్థాయి ప్రసూతిలకు కేంద్రబిందువుగా మారి గర్భవతులకు విశేష సేవలందిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా వరకు మెరుగుపడిందని చెప్పకతప్పదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

ప్రైవేటు వైద్యశాలలకు ధీటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్ని వసతులతో నిపుణులైన వైద్యులతో నిరంతర సేవలందించడానికి అందుబాటులోకి వచ్చింది.గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలంటేనే బయపడిన గర్భవతులు నేడు నిర్భయంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలి వస్తున్నారు. గర్భం దాల్చినప్పటినుంచి మొదలుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తుండడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిత్యం కిటకిటలాడుతున్నది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారి సంఖ్య ఘననీయంగా పెరిగిందని చెప్పవచ్చు.

దీనికి తోడు తల్లీబిడ్డల సంరక్షణ..బాలింతలు, శిశు మరణాలను నివారించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం అందుబాటులోకి రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి.

గర్భవతులకు విడతల వారీగా చేయూత

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా గర్భవతి అయిన తల్లి ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు చేయించుకున్న వారికి ఆడశిశువు జన్మిస్తే 13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ 12 వేలు ఆర్థికంగా చేయూత ప్రభుత్వం అందిస్తోంది. గర్భవతి అయిన మహిళ ప్రభుత్వ వైద్యశాలలో రెండు సార్లు వైద్యపరీక్షలు చేయించు కుంటే మొదటి విడుతగా రూ 3000లు ఆర్థిక సహాయం అందజేస్తుంది. రెండవ విడుతగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవించిన బాలింతలకు ఆడశిశువు జన్మిస్తే రూ 5 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ 4 వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది.

బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలలపాటు ఇవ్వవలసిన టీకాలు తీసుకున్నప్పుడు మూడవ విడుత రూ 2వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. పుట్టిన బిడ్డకు 9 నెలలపాటు ఇవ్వవలసిన టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించిన తర్వాత 9వ నెలలో నాల్గవ విడుత ఆర్థిక సహాయంగా కింద రూ 3 వేలు అందిస్తుంది. ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు బాలింతలకు అమ్మ ఒడి కిట్‌లను పంపిణీ చేస్తారు. మొదటి, రెండవ కాన్పుల బాలింతలకు మాత్రమే అమ్మ ఒడి కిట్‌తో పాటు ఆర్థిక సహాయం అందజేయడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మూడు అంతకంటే ఎక్కువ కాన్పులు చేయించుకున్న మహిళలకు కేవలం అమ్మ ఒడి కిట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఆరోగ్య కేంద్ర అధికారులు తెలియజేశారు.