క్రైమ్సినిమా

ప్రముఖ హీరో దర్శన్‌ రోడ్డు ప్రమాదం..

శాండల్‌వుడ్‌ ప్రముఖ హీరో దర్శన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం వివిధ కార్యక్రమాలలో పాల్గొని బెంగళూరుకు వెనుతిరిగి వస్తుండగా ఇళకల్‌ సమీపంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో దర్శన్‌ చేతికి ధరించిన కడియం చీలడంతో కుడిచేయి ఎముక దెబ్బతింది. దీంతో దర్శన్‌చేతికి శస్త్ర చికిత్స చేసి రాడ్‌ అమర్చారు. దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన గజరాజుల మావటీలకు విందు ఏర్పాటు చేసిన దర్శన్‌ రాత్రి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దక్షిణాది నటుడు దేవరాజ్‌ అతని కుమారుడు కన్నడ హీరో ప్రజ్వల్‌ దేవరాజులతో పాటు మిత్రుడు ఆంటోనితో కలిసి తెల్లవారున బయలుదేరారు.
3 గంటలలో వర్షం కారణంగా రోడ్డు కనిపించక కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వెనువెంటనే గాయపడ్డ నలుగురినీ కొలంబియా ఏషియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు కనిపించకుండా మాయం చేసి బెంగళూరుకు తరలించగా పోలీసుల ఆదేశాలతో మైసూరుకు తరలించారు. దేవరాజ్‌ కాలికి చికిత్సలు జరిపినట్లు సమాచారం. ప్రమాద విషయం తెలియగానే దర్శన్‌ భార్య విజయలక్ష్మి కుమారుడు వినీష్‌లు మైసూరు ఆసుపత్రికి చేరారు. ఇదిలా ఉండగా తాను క్షేమమని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆడియోను దర్శన్‌ విడుదల చేశారు. రోడ్డు ప్రమాదంలో దర్శన్‌తో పాటు మరో హీరో ప్రజ్వల్‌ దేవరాజ్‌, నటుడు దేవరాజ్‌లు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన సినిమారంగానికి చెందిన ప్రముఖులు మైసూరుకు చేరుకుని పరామర్శించారు.