సినిమా

ప్రముఖ సినీ నటుడు వైజగ్‌ ప్రసాద్‌ కన్నుమూత..

ప్రముఖ క్యారెక్టర్ నటుడు వైజాగ్ ప్రసాద్ నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు రత్నప్రభ, రత్నకుమార్ ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. వైజాగ్ లోని గోపాలపట్నం ఆయన స్వగ్రామం.

1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన వైజాగ్‌ ప్రసాద్.. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్‌, గరీబీ హఠావో లాంటి నాటికలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో ఆయన నటించారు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన, టీవీ సీరియల్స్ లోనూ పలు కీలకమైన పాత్రలు పోషించి తెలుగు అభిమానులకు వినోదాన్ని అందించారు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన వైజాగ్ ప్రసాద్, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రను పోషించి, మెప్పించిన తరువాత, వరుసగా అవకాశాలను పొందారు. భద్ర, జై చిరంజీవ, గౌరి, జానకీ వెడ్స్
శ్రీరామ్ తదితర చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు. ప్రసాద్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.